Saturday, November 5, 2011

Don't overheat milk

పాలను పదేపదే కాచొద్దు
అధిక ఉష్ణోగ్రతల వద్ద మరిగిస్తే పోషకాలు ఆవిరి
ఇండియన్ మెడికల్ అకాడమీ అధ్యయనం
న్యూఢిల్లీ, నవంబర్ 4: మీరు పాలను రోజులో నాలుగైదు సార్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద మరిగిస్తారా? అయితే పాలలో ఉండే అనేక రకాల పోషకాలు మీకు అందనట్టే. దేశంలో మెజారిటీ మహిళలు ఇలా పాలను అధిక ఉష్ణోగ్రతల్లో పదేపదే కాచి వాటిలో పోషకాలను పొందలేకపోతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఇండియన్ మెడికల్ అకాడమీ వారు ఈ అధ్యయనం చేశారు.

ఇందులో భాగంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చండీగఢ్ నగరాల్లో, ఒక్కోచోటా 300 మంది చొప్పున మొత్తంగా 2,400 మంది మహిళలను వారు ప్రశ్నించారు. వారిలో ఎక్కువమందికి పాలను సరిగా కాచే విధానంపై సరైన అవగాహన లేదని తేలింది.

దాదాపు 49 % మంది రోజుకు మూడుసార్లకు మించి పాలను మరిగిస్తున్నారని, 56 % మంది ఐదు నిమిషాలకు మించి అధిక ఉష్ణోగ్రతలో పాలను కాస్తున్నారని.. అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. నిజానికి పాలను తగుమాత్రం ఉష్ణోగ్రత వద్ద మూడు నిమిషాలకు మించి కాచాలని వైద్యులు చెబుతున్నారు. అంతకు మించి మరిగించితే పాలలో ఉండే నీటిలో కరిగే బి గ్రూపు విటమిన్లు ఇగిరిపోతాయని వారు వివరిస్తున్నారు.

నిజానికి పాలలో విటమిన్ సి, ఐరన్ మినహా శరీరానికి రోజువారీ కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ప్రత్యేకించి.. కొవ్వులో మాత్రమే కరిగే ఏ, డి విటమిన్లు, ఎముకలకు పటుత్వాన్నిచ్చే కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పాలను బాగా మరిగించడం వల్ల ఆయా పోషకాలు అందకుండా పోతాయని హెచ్చరించారు.
Source:AJ

No comments:

Post a Comment