Saturday, November 5, 2011

ఫ్లోటింగ్ బెటరా? ఫిక్స్‌డ్ బెటరా?

ఇంటి రుణంపై వడ్డీ రేట్లు బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చలనవడ్డీ (ఫ్లోటింగ్) రేటు తీసుకోవటం మంచిదా? స్థిర (ఫిక్స్‌డ్) వడ్డీరేటు మంచిదా?

సి.హెచ్. ప్రకాష్, హైదరాబాద్
వడ్డీరేట్లు అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి రుణాలపై చలన వడ్డీ రేటు ఎంచుకోవడమే మెరుగైనది. ఫిక్స్‌డ్ వడ్డీరేటు ఎంచుకుంటే ఇంకా అధికంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కొన్నాళ్లకయినా దేశ ఆర్థిక పరిస్థితి స్థిరపడి ఇంటి రుణాలపై వడ్డీరేటు తగ్గుతాయని ఆశించవచ్చు. అప్పుడు చలన వడ్డీ రేటు కూడా ఆగుతుంది. ఊళ్లో అన్ని ఇళ్లపై వర్షం పడితే మన ఇంటిపై కూడా వర్షం పడుతుంది. ఇంటిరుణంపై చలన వడ్డీరేటు కూడా అంతే. అందరికీ వడ్డీ పెరిగితే మనకీ వడ్డీ పెరుగుతుంది.

అందరితోపాటు మన ఇంటి రుణంపై కూడా వడ్డీరేటు తగ్గుతుంది. దేశ ఆర్థికస్థితి స్థిరంగా ఉన్నపుడు ఇంటి రుణంపై వడ్డీరేట్లు తగ్గుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఫిక్స్‌డ్ వడ్డీరేటు ఎంచుకోవడం మేలు. మరొక ముఖ్య విషయం... ఫిక్స్‌డ్ వడ్డీరేటు అంటే చాలా బ్యాంకుల దృష్టిలో పూర్తిగా స్థిరంగా ఉండే వడ్డీరేటు కాదు. అసాధారణ పరిస్థితుల్లో వడ్డీరేటు ఫిక్స్‌డ్ అని చెప్పినా, దానిని కూడా మార్చే హక్కు బ్యాంకుకు ఉంటుందనే నిబంధనను కొన్ని బ్యాంకులు రుణ నిబంధనల్లో పేర్కొంటున్నాయి. అటువంటి నిబంధనలను కూడా పరిశీలించి మీరు నిర్ణయం తీసుకోండి.

ఇంటి రుణంపై ఫిక్స్‌డ్ రేటు వడ్డీని ఎంచుకుంటే రుణంలో వాయిదా మొత్తం కంటే ఎక్కువ చెల్లిస్తే వడ్డీలో మార్పు ఉండదు కదా! ముందుగా చెల్లించే ఇంటి రుణం వల్ల మాకేమైనా ప్రయోజనం ఉంటుందా?
కానుమూరు విజయలక్ష్మి, విజయవాడ
ఇంటి రుణంపై స్థిర (ఫిక్స్‌డ్) వడ్డీరేటు అంటే వడ్డీ స్థిరంగా ఉంటుందని అర్థం కాదు. వడ్డీరేటు స్థిరంగా ఉంటుందని అర్థం. ఉదాహరణకు మీకు లక్షరూపాయలు ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. దానిపై పది శాతం ఫిక్స్‌డ్ వడ్డీరేటు ఉంటే, లక్ష రూపాయలపై ఏడాదికి వందకి పది రూపాయల చొప్పున పదివేల రూపాయల వడ్డీ పడుతుంది. ప్రతినెల వడ్డీ చెల్లించక పోతే వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ) పడుతుంది. కాబట్టి ఈ వడ్డీ మరికాస్త పెరుగుతుంది. చలన వడ్డీరేటు ఎంచుకున్నపుడు వడ్డీ 11శాతానికి పెరిగితే ఏడాదికి 11వేల రూపాయల వడ్డీ పడుతుంది. స్థిరవడ్డీ ఎంచుకుంటే, ఇతర రుణాలకు వడ్డీరేటు మారినా మీ ఇంటి రుణంపై వడ్డీ మారదు.

మీరు ఎంచుకున్నది స్థిర వడ్డీ అయినా చలనవడ్డీ అయినా మీ లక్ష రూపాయల ఇంటి రుణంలో 60వేల రూపాయలు తిరిగి చెల్లించేస్తే మిగిలిన నలభైవేల రూపాయలపైనే వడ్డీ పడుతుంది. కాబట్టి మీ వద్ద మిగులు ఉన్న సొమ్మును ఇంటి రుణంలో అదనంగా చెల్లించడానికి వినియోగించండి. వడ్డీ భారాన్ని తగ్గించుకోండి. ప్రస్తుత అధిక వడ్డీ పరిస్థితుల్లో ఇంటి రుణానికి చెల్లించాల్సిన వాయిదా కంటే సాధ్యమైనంత ఎక్కువగా చెల్లిస్తేనే మంచిది. చలన వడ్డీరేటు కంటే స్థిరవడ్డీ రేటుపై బ్యాంకులు అధికంగా వడ్డీరేటు వసూలు చేస్తాయి.

ఐదేళ్లుగా నేను కడుతున్న ఎండోమెంట్ బీమా పాలసీ బీమాపరంగా, రాబడి పరంగా నాకు తగిన పాలసీ కాదని మీ పుస్తకం చదివిన తర్వాత అర్థం అయింది. ఆ పాలసీని మరో 20 ఏళ్లపాటు కట్టాల్సి ఉంది. దానిని మానేయాలని ఉంది. కానీ నా భార్య ఒప్పుకోవడం లేదు. ఇన్నాళ్లు కట్టిన దానిని మానేయడం ఎందుకు, కావాలంటే కొత్తది తీసుకోండి అని అంటోంది. నేనేం చేస్తే బాగుంటుంది. ?

పిట్ట చరణ్, నూజివీడు
'పోకిరి' సినిమాలో హీరో మహేష్‌బాబు ఫేమస్ డైలాగ్ "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను'' అంటాడు. మన దేశంలో పాలసీల విషయంలో చాలా మంది ఇదే మార్గాన్ని అనుసరిస్తారు. ఐదేళ్ల లాస్ బెటరా? ఇరవయ్యేళ్ల లాస్ బెటరా?...ఆలోచించుకోండి. మీరు కడుతున్న పాలసీ నష్టాన్ని కలిగించేది అనిపిస్తే రాగద్వేషాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడమే మంచిది. అయితే ముందు మీ జీవిత విలువను బట్టి మంచి బీమా పాలసీ తీసుకున్న తర్వాతే ఉన్న పాలసీని సరెండర్ చేయడం గానీ, దాని పెయిడ్ ఆఫ్ వాల్యూని గడవు తర్వాత తీసుకోవడం గాని చేయండి.

వంగా రాజేంద్రప్రసాద్
ఆర్థికసలహాదారులు
ఫోన్ : 0870 2446479

Source:AJ

No comments:

Post a Comment