అమ్మ జగనా?
లోపల జరిగిందేమిటి?
బయట చెప్పిందేమిటి?
జగన్నాటకంలో నిజ ఘట్టం
విచారణలో చుక్కలు చూపిన సీబీఐ
బతిమిలాటకు దిగిన కడప ఎంపీ
లోపల వినతులు, బయట గెంతులు
తెరపైకి అనూహ్యంగా కొండారెడ్డి
జగన్ పాత బంధాన్ని తవ్వి మరీ
ఆఫీసుకు పట్టుకొచ్చిన అధికారులు
కొండారెడ్డి తనకు తెలియదంటూ
బుకాయింపునకు దిగిన యువనేత
పక్క గదిలో ఉన్నాడు మాట్లాడతావా
అని సూటిగా ప్రశ్నించిన అధికారులు
వేడుకోళ్లకు దిగిన కడప ఎంపీ
తనను దిగజార్చొద్దని విన్నవింపు
'ఆంధ్రజ్యోతి'కి చిక్కిన అసలు గుట్టు
సీబీఐ ఆఫీసు లోపల జరిగింది ఒకటి... బయటికి వచ్చి చెప్పింది ఒకటి! వారెవా... నవరస నటనా సార్వభౌములూ అవాక్కయ్యేలా ఏమి యాక్షన్ బాసూ! సీబీఐ ఇచ్చిన 'షాక్'తో పట్టపగలే చుక్కలు చూసినా... బయటికి వచ్చాక సీబీఐనే చిక్కుల్లో పడేసినట్లు బిల్డప్ ఇవ్వడమంటే మాటలా! ఓబుళాపురం కేసులో కడప ఎంపీ జగన్ శుక్రవారం సీబీఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా తాను... చంద్రబాబును ప్రశ్నించాలని సీబీఐని అడిగినట్లు జగన్ చెప్పారు. ఆ మాట నిజమే! కానీ, అది చివరాఖరి మాట! అంతకంటే ముందు సీబీఐ ఆఫీసులో చాలా జరిగింది. జగన్‌కు ముచ్చెమటలు పోసినంత పనైంది. ఆ సంగతంతా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా 'ఆంధ్రజ్యోతి'కి తెలిసింది. అదేమిటో మీరే చదవండి...
హైదరాబాద్, నవంబర్ 5 : 'గాలి జనార్దన రెడ్డితో నాకేం సంబంధం! ఆయనెవరో, నేనెవరో' అంటూ జగన్ అమాయక ఫేసు పెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. నిజానికి, తన తండ్రి అధికారంలో ఉండగా 'గాలి'కి మేలు చేయడమే లక్ష్యంగా జగన్ చాలా చాలా చేశారు. వైఎస్ హయాంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అడ్డగోలుగా కొత్త గనులు కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం గనులను 'మొదట వచ్చిన వారికి మొదట' ప్రాతిపదికన కేటాయించాలి.
ఇవే గనుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి ఒకరు. వీరందరినీ పక్కకు తప్పించి గాలికి లీజులు కట్టబెట్టేందుకు జగన్ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. అందరి విషయంలో విజయం సాధించినప్పటికీ... కొండారెడ్డి మాత్రం బాగా బెట్టు చేశారు. క్షేత్రస్థాయిలో మొత్తం ఆయనకే లీజు కేటాయిస్తూ ఆదేశాలు వెళ్లినప్పటికీ... సచివాలయం దాకా వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. గనుల లీజు 'గాలి' కంపెనీకి దక్కింది. దీంతో కొండారెడ్డి కోర్టుకు వెళ్లారు.
ఆ తర్వాత జగన్ స్వయంగా రంగంలోకి దిగి కొండారెడ్డితో మాట్లాడారు. బెంగళూరులోని తన ఇంటికి పిలిపించుకున్నారు. "గాలి జనార్దన రెడ్డి మనకు కావాల్సిన మనిషి. ఎన్నికల్లో మనకు చాలా చేశాడు. నువ్వు పక్కకు తప్పుకో'' అని సూచించారు. ఇందుకు కొండారెడ్డి ససేమిరా అన్నారు. ఆ గనులు న్యాయంగా తనకే రావాలని, పక్కకు తప్పుకోలేనని స్పష్టం చేశారు. ఈలోపు ఓఎంసీకి గనుల కేటాయింపుపై కోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత కొండా రెడ్డిని జగన్ మరోమారు బెంగళూరుకు పిలిపించుకున్నారు.
"అసలు ఓబుళాపురం గనుల విలువ ఎంతో నీకు తెలుసా? టన్నుకు వంద రూపాయలు వేసుకున్నా 600 కోట్ల విలువ చేస్తాయి. గాలికి నాన్న (వైఎస్) మాట ఇచ్చాడు. కోర్టులో కేసు విత్ డ్రా చేసుకో!' అని సూచించారు. రాష్ట్రమంతా తన చేతిలోనే ఉందని, ఏం కావాలంటే అది చేసి పెడతామని ఊరించారు. 'సరే... గనుల్లో 50 శాతం వాటా ఇవ్వండి' అని కొండారెడ్డి కోరగా... వాటాలు గీటాలు కుదరవని తేల్చి చెప్పారు. 'ఈసారి విస్తరణలో మీనాన్నకు పదవి ఇస్తాం. ఆ తర్వాత నీ ఇష్టం' అని కొండారెడ్డికి జగన్ తేల్చి చెప్పారు. అప్పటికీ పక్కకు తప్పుకొనేందుకు కొండారెడ్డి ఇష్టపడలేదు.
ఆ తర్వాత సన్నిహితులతో, శ్రేయోభిలాషులతో చర్చించారు. 'పెద్దవాళ్లతో పెట్టుకోవడం ఎందుకు' అని అంతా సూచించడంతో కేసు విత్‌డ్రా చేసుకునేందుకు అంగీకరించారు. ఆ సమాచారాన్ని జగన్‌కు చేరవేశారు. ఈసారి కొండారెడ్డిని హైదరాబాద్‌లోని ఆర్ఆర్ గ్లోబల్ ఆఫీసుకు పిలిపించారు. కేసు వెనక్కి వాపసు తీసుకుంటున్నట్లు వాళ్లే పత్రాలు సిద్ధం చేశారు. వాటిపై కొండారెడ్డితో సంతకాలు చేయించుకున్నారు. దీంతో... గనులను గాలికి కట్టబెట్టేందుకు మార్గం సుగమమైంది.
ఇదంతా జగన్ ప్రత్యక్ష ప్రమేయంతోనే జరిగింది. ఈ వివరాలన్నీ... సీబీఐ అధికారులకు తెలిశాయి. ఇదే విషయమై కొండారెడ్డిని ప్రశ్నించగా... ఆయన జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు. 'ఇదే విషయం కోర్టులో కూడా చెబుతారా?' అని సీబీఐ అడగడం, 'చెబుతా!' అని కొండారెడ్డి బదులివ్వడం జరిగింది. 'జగన్‌ను పిలిపిస్తాం! ఇదంతా ఆయన ముందు చెప్పేందుకు సిద్ధమా?' అని సీబీఐ అధికారులు అడిగారు. 'ఎక్కడైనా చెబుతా' అని కొండారెడ్డి అంతే ధృడచిత్తంతో బదులిచ్చారు. వైఎస్ జగన్ 'బోల్డు ఫేసు' కథలో ఇది ఇంటర్వెల్. ఆ తర్వాత ఏమైందంటే...
శుక్రవారం జరిగిందిదీ...
కోఠిలోని సీబీఐ కార్యాలయానికి జగన్ చేరుకోవడానికంటే ముందే... అధికారులు కొండారెడ్డిని అక్కడికి పిలిపించారు. ఆయనను ఓ గదిలో కూర్చోబెట్టారు. మరో గదిలో జగన్‌ను రకరకాల ప్రశ్నలు అడిగారు. కొండారెడ్డి చెప్పిన విషయాల ప్రస్తావన తీసుకొచ్చారు. షరా మామూలుగానే... జగన్ అదంతా ఒట్టిదేనన్నారు. గత ఎన్నికల్లో కొండారెడ్డి తండ్రి వరద రాజులు రెడ్డి ఓటమికి తామే కారణమని వారు భావిస్తున్నారని, అందుకే ఇలా చెప్పి ఉండొచ్చని అన్నారు. కొండారెడ్డితో తనకు సంబంధం లేదని, ఆయనను ఎప్పుడూ తన దగ్గరికి పిలిపించుకోలేదని చెప్పారు.
సరిగ్గా అదే సమయంలో సీబీఐ అధికారులు జగన్‌కు కలలో కూడా ఊహించని విధంగా 'షాక్' ఇచ్చారు. "కొండారెడ్డి చెప్పిందంతా అబద్ధమంటున్నారు కదా! ఆయన పక్క గదిలోనే ఉన్నారు. ఆయన ముందే ఇదంతా చెబుతారా?'' అని ప్రశ్నించారు. దీంతో జగన్‌కు దిమ్మతిరిగినంత పనైంది. కొండారెడ్డిని కలవనని చెప్పారు. 'అలాగైతే ఎలా? మీరు చెప్పింది నిజమని మాకెలా నిర్ధారణ అవుతుంది? ఆయనను ఫేస్ చేయాల్సిందే' అని సీబీఐ అధికారులు సూటిగా చెప్పారు.
అయినా... జగన్ ససేమిరా అన్నారు. తొలుత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. సీబీఐ అధికారులు పట్టు విడవకపోవడంతో జావగారిపోయారు. "నన్ను దిగజార్చ వద్దు. ఇబ్బంది పెట్టొద్దు. నా వాంగ్మూలం నేను ఇస్తాను. కొండారెడ్డిని మాత్రం ఫేస్ చేయను' అని ప్రాధేయపడినంత పని చేశారు. దీంతో... అసలు విషయమేమిటో సీబీఐకి అర్థమైపోయింది. 'జగన్ మిమ్మల్ని ఫేస్ చేసేందుకు సిద్ధంగాలేరు. మీరు వెళ్లవచ్చు' అని కొండా రెడ్డిని అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత ఓఎంసీకి 64 ఎకరాల లీజు బదిలీ చేస్తూ చంద్రబాబు హయాంలో ఇచ్చిన జీవోను జగన్ సీబీఐ చేతిలో పెట్టారు.
ఈ విషయంలో చంద్రబాబును ప్రశ్నించాలని కోరారు. గాలికి వైఎస్ హయాంలో 'మేళ్లు' జరిగాయని, ఓఎంసీకి గనుల కేటాయింపు వెనుక జగన్ ఒత్తిళ్లు పని చేశాయని సీబీఐకి స్పష్టంగా అర్థమైపోయింది. దీంతో.. 'ఇక మీరు వెళ్లవచ్చు' అంటూ జగన్‌ను పంపించారు. బయటికి వచ్చిన యువనేత 'చంద్రబాబు - జీవో' సంగతి మాత్రమే మీడియాకు చెప్పారు. అంతకుముందు జరిగిందంతా గుట్టుగా దాచేశారు. కానీ... దాచాలంటే దాగదులే! దాగుడు మూతలు సాగవులే!
Source: AJ
You write awesome and look great.Hey, I read your article it was very informative and very helpful
ReplyDeleteawesummly is the India’s one of the Short News App. awesummly
If anybody want to download awesummly app click here News App