Friday, November 4, 2011

అడ్డగోల జగన్

అడ్డగోల జగన్
అడ్డదిడ్డం వాదనతో అడ్డంగా దొరికెన్
గాలికి మేలు చేసింది చంద్రబాబేనట!
ఆంధ్రజ్యోతి మీడియాపై నిందలు

పాత జీవోతో ఎదురుదాడి యత్నం
అసలు 'మేళ్లు' ఆయన తండ్రి హయాంలోనే
బాబు సర్కారులో లీజుల పొడిగింపు
గాలికి ప్రాణం పోసింది రాజశేఖరుడే
2 నెలల్లో ముగిసే లీజు 13 ఏళ్లు పొడిగింపు
బ్రహ్మిణి పేరిట 270 ఎకరాలు ధారాదత్తం
హైదరాబాద్, నవంబర్ 4: భలే చెప్పావ్ బాసూ! రెండున్నర గంటలపాటు సీబీఐ అధికారుల సూటి ప్రశ్నలు ఎదుర్కొని... బయటికొచ్చాక సీబీఐనే ఇరుకున పెట్టినట్లుగా 'బోల్డ్ ఫేసు'! వినేవాళ్లుండాలే కానీ... మీ నోటికి అడ్డేముంది! వైఎస్ జగన్ చెప్పే 'విలువ'లకు అర్థమేముంది? 'పాత చింతకాయ పచ్చడి' జీవో పట్టుకొచ్చి ఓబుళాపురం కంపెనీకి చంద్రబాబే గనుల లీజు ఇచ్చారని... గాలి జనార్దన రెడ్డికి ఆయనే సహకరించారని జగన్ చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగితే సరిపోయేది! కానీ... 'ఎల్లో మీడియా'కు ఏమాత్రం జర్నలిజం విలువలున్నా చంద్రబాబును 'ఎక్స్‌పోజ్' చేయాలని పాత్రికేయ పాఠాలు చెప్పారు. 'ఆంధ్రజ్యోతి'నీ వేలెత్తి చూపారు. తద్వారా మహా తెలివితేటలు ప్రదర్శించాననుకుంటూ మురిసిపోతున్నారు. నిజానికి... తన పసలేని వాదనతో జగన్ అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఓబుళాపురం గనులకు సంబంధించి చంద్రబాబు వరకు మాత్రమే వచ్చి ఆగిపోయారు. ఆ తర్వాత తన తండ్రి హయాంలో జరిగిన అడ్డగోలు సంగతులను 'విస్మరించారు'.

'ఆంధ్రజ్యోతి'కి ఎవరినీ రక్షించాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓఎంసీకి సంబంధించి 2002లో చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో 'ఆంధ్రజ్యోతి' ఎన్నోసార్లు వివరించింది. వైఎస్ వచ్చాక గనుల మాటున జరిగిన ఘోరాలు అక్షరాలా విడమరిచి చెప్పింది. ఓబుళాపురం పుట్టు పూర్వోత్తరాలను చూస్తే... గాలి జనార్దన రెడ్డికి చంద్రబాబు ఏం చేశారో, వైఎస్ ఎన్ని 'మేళ్లు' చేసి పెట్టారో ఇట్టే అర్థమవుతుంది. 'కథ'ను జగన్ ఇంటర్వెల్ దాకా మాత్రమే చెప్పారు. విషయం ఎన్నో మలుపులు తిరిగింది 'సెకండ్ ఆఫ్'లోనే! అంటే... వైఎస్ హయాంలోనే! చూడండి మరి...

వైఎస్‌కు ముందు...
1984 డిసెంబర్ 14: అనంతపురం జిల్లా ఓబుళాపురంలో 64 ఎకరాల విస్తీర్ణంలోని ఇనుప ఖనిజం గనులను 20 ఏళ్ల కాలానికి జి.రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి లీజుగా ఇచ్చింది. అంటే... 2004 డిసెంబర్ 13తో ఈ గడువు ముగుస్తుంది. (నిజానికి... ఈ లీజు వ్యవహారం 1964 నుంచి నడుస్తోంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డికి 547.62 ఎకరాలను లీజుగా ఇచ్చింది. రామచంద్రారెడ్డి మరణం తర్వాత ఆయన చట్టబద్ధ వారసుడిగా రామ్మోహన్ రెడ్డి తెరమీదికి వచ్చారు. కోర్టు వివాదాల నేపథ్యంలో... హైకోర్టు ఆదేశాల మేరకు 64 ఎకరాలను మాత్రమే రామ్మోహన్ రెడ్డికి లీజుగా ఇచ్చారు. ఇది జరిగింది 1991లో. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది.)

1996 డిసెంబర్ 10: రామ్మోహన్ రెడ్డి పేరిట ఉన్న లీజును చంద్రబాబు ప్రభుత్వం రెన్యువల్ చేసింది. అదికూడా... 1984 నుంచి 20 ఏళ్లు ప్రాతిపదికగా తీసుకుంది. ఈ లీజు 1997 ఏప్రిల్ 26న 'ఎగ్జిక్యూట్' అయినప్పటికీ, గడువు మాత్రం 2004 డిసెంబర్ 13తో ముగుస్తుందని స్పష్టం చేసింది.

2001 జూన్ 23: తన పేరిట ఉన్న లీజును మెసర్స్ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అనే భాగస్వామ్య సంస్థ పేరిట బదిలీ చేయాలని రామ్మోహన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత దీనిని ఆయనే ఉపసంహరించుకున్నారు. ఇది చంద్రబాబు హయాం.

2001 నవంబర్ 2: లీజును ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేయాలని రామ్మోహన్ రెడ్డి మరో దరఖాస్తు పెట్టుకున్నారు.

2002 ఫిబ్రవరి 2: రామ్మోహన్ రెడ్డి పెట్టుకున్న దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. లీజు గడువులో మిగిలిన కాలానికి... అంటే 2004 డిసెంబర్ 13 వరకు మాత్రమే ఇది వర్తిస్తుందని జీవో నెంబర్ 80లో స్పష్టం చేసింది. ఈ జీవో వెలువడిన నాటికి ఓఎంసీకి, గాలి జనార్దన రెడ్డికి సంబంధం లేదు.

2002 మే 2: ఓఎంసీలో గాలి జనార్దన రెడ్డి భాగస్వామి అయ్యారు. చంద్రబాబు హయాంలో లీజు బదిలీ ద్వారా ఏదైనా మేలు జరిగిందనుకుంటే అది ఓఎంసీకే జరిగింది. కానీ... గాలి జనార్దన రెడ్డికి కాదు.

వైఎస్ హయాంలో...
2004 సెప్టెంబర్ 10: మరో రెండు నెలల్లో ముగియాల్సిన ఓఎంసీ లీజు గడువును వైఎస్ ప్రభుత్వం 2017 వరకు పొడిగించింది. 1984లో కుదుర్చుకున్న ఒప్పందం 1997 వరకు అమలు కాలేదని, అందువల్ల 1997ను ప్రాతిపదికగా చేసుకుని 20 ఏళ్లు లీజు ఇవ్వాలని ఓఎంసీ పెట్టుకున్న దరఖాస్తుపై సానుకూలంగా స్పందించింది. జీవో నెంబర్ 202 జారీ చేసింది. వెరసి... రెండునెలల్లో ముగియాల్సిన 'గాలి' కథను 13 ఏళ్లపాటు పొడిగించింది.

2007 జూలై 18: గాలి గనుల కంపెనీకి వైఎస్ సర్కారు ఒకే రోజు 270 ఎకరాల గనులు అప్పగించింది. జీవో నెంబర్ 151, 152 ద్వారా ఈ కేటాయింపు జరిపింది. సంబంధిత ఫైళ్లు అసాధారణ వేగంతో కదిలాయి. గుమాస్తా నుంచి మంత్రి దాకా అందరూ చకచకా సంతకాలు చేసేశారు. ఇది కూడా అడ్డగోలు కేటాయింపే. ఈ గనుల లీజు కోసం జి.సురేశ్ బాబు, సునీల్ ఎర్లా అనే వ్యక్తులు తొలుత దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వీరికే కేటాయించాలి. కానీ... సామ దాన దండోపాయాలను ఉపయోగించి వారిని పక్కకు తప్పించారు.

అసలు మోసం: కడప జిల్లాలో ఏర్పాటు చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన బ్రహ్మణి స్టీల్స్ కోసమే ఖనిజాన్ని ఉపయోగించాలనే (క్యాప్టివ్ మైనింగ్) నిబంధన మేరకే ఓఎంసీకి 270 ఎకరాల గనులు కట్టబెట్టారు. నోట్‌ఫైల్‌లో ఉన్న ఈ నిబంధన... జీవోల దాకా వచ్చేసరికి మాయమైపోయింది. అదే సమయంలో ఇనుప ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో... ఓఎంసీ నుంచి, ఓఎంసీ ముసుగులో కర్ణాటక నుంచి తవ్వుకున్న ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకున్న 'గాలి' వేలకోట్లకు పడగలెత్తారు.

అది కాదు మ్యాటరు...
'దాచాలంటే దాగవులే అన్నట్లు' జగన్ ప్రస్తావించకుండా వదిలేసినంత మాత్రాన అసలు విషయాలు తెరమరుగు కావు.
- సీబీఐ దర్యాప్తు జరుపుతున్నది ఓబుళాపురం గనులకు ఎవరు లీజులు ఇచ్చారనే అంశంపై కాదు! ఓఎంసీ చేసిన అక్రమ తవ్వకాలు, దానికి ఎవరు సహకరించారు? అనేదే ఇక్కడ ముఖ్యం.
- ఒకవేళ జగన్ చెబుతున్నట్లుగా ఓఎంసీకి గనులు ఎవరు కేటాయించారన్నదే ముఖ్యమని భావించినా... కొత్తగా లీజులు ఇచ్చింది ఆయన తండ్రి వైఎస్ హయాంలోనే.
- వైఎస్ జమానాలో పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి, గనులశాఖ డైరెక్టర్ రాజగోపాల్, అటవీ శాఖ అధికారి శివశంకర్ రెడ్డి, అనంతపురం డీఎఫ్‌వో కల్లోల్ బిశ్వాస్ గాలి అక్రమాలకు పూర్తిస్థాయిలో సహకరించారనే ఆరోపణలున్నాయి.
- కర్ణాటక, ఆంధ్ర మధ్య సరిహద్దులను చెరిపేసి మరీ మైనింగ్ జరిపింది వైఎస్ హయాంలోనే.
- 'గాలి జనార్దన్ రెడ్డితో నాకేం సంబంధం' అని జగన్ ప్రశ్నించడం వింతలోకెల్లా వింత. ఎందుకంటే.. గాలి డైరెక్టర్‌గా ఉన్న ఓఎంసీలో సగం వాటా పొందిన రెడ్ గోల్డ్ ద్వారానే జగన్ మీడియాలోకి రూ.70 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఇది జగన్ కూడా కాదనలేని వాస్తవం!
- గాలి జనార్దన రెడ్డి ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన బ్రహ్మణికి 10,700 ఎకరాలు, విమానావ్రయం కోసం 4 వేల ఎకరాలు కేటాయించింది ఎవరో కాదు! స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డే!

Source: Andhrajyothy

No comments:

Post a Comment